: 'సర్వీసు గొప్పగా ఉంది, అయినా నల్లజాతి వాళ్లకు టిప్ ఇచ్చేది లేదు!' అంటూ మెసేజ్ పెట్టిన శ్వేతజాతి జంట
అమెరికాలోని ఓ కేఫ్ లో వెయిట్రెస్ గా పనిచేస్తున్న ఒక నల్లజాతి మహిళపై ఓ శ్వేతజాతీయ జంట తమ జాత్యహంకారాన్ని ప్రదర్శించింది. వర్జీనియాలోని ఆష్ బర్న్ లో 'అనితాస్ న్యూ మెక్సికో స్టైల్ కేఫ్' ఒకటి ఉంది. ఈ కేఫ్ లో కెల్లీ కార్టర్ అనే నల్లజాతీయురాలు వెయిట్రెస్ గా పనిచేస్తోంది. ఆ కేఫ్ కు ఓ శ్వేతజాతి జంట బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు వచ్చింది. ‘సర్వీసు గొప్పగా ఉంది. అయినా, నల్లజాతి వాళ్లకు టిప్ ఇచ్చేది లేదు’ అని బ్రేక్ ఫాస్ట్ అనంతరం ఆ జంట ఆ మెసేజ్ పెట్టింది.
కాగా, ఈ విషయమై కెల్లీ కార్టర్ మాట్లాడుతూ, మొదట్లో ఈ మెసేజ్ ని అర్థం చేసుకోలేకపోయానని, ఆ తర్వాత అర్థం చేసుకున్న తాను చాలా బాధపడ్డానని చెప్పింది. అయితే, మిగిలిన కస్టమర్ల మాదిరిగానే వారిని తాను గౌరవిస్తున్నానని చెప్పింది. ఆ శ్వేత జాతి జంటలో మహిళ మాత్రం తాను సర్వ్ చేసిన ఆహారం బాగుందని ప్రశంసించిందని పేర్కొంది. ఈ సందర్భంగా కేఫ్ యజమాని టామీ టెల్లిజ్ మాట్లాడుతూ, శ్వేతజాతి జంట ప్రవర్తించిన తీరు నిరుత్సాహం కల్గించిందని, కెల్లీ సిన్సియర్ ఉద్యోగి అని, కస్టమర్లు ఆమెను ఎంతగానో అభిమానిస్తుంటారని చెప్పారు.