: బీఎండబ్యూ కారుని పార్క్ చేశాడు... ఎక్కడ చేశాడో మర్చిపోయాడు!
ఎంతో హుషారుగా కారులో ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లాడు... కారుని పార్క్ చేసి తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశాడు.. కార్యక్రమం అయిపోగానే బయటకు వచ్చాడు. అయితే, తాను తన కారుని ఎక్కడ పార్క్ చేశాడో మర్చిపోయి తికమకపడ్డాడు. ఎంత వెతికినా దొరకలేదు.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తాను ఎక్కడ పార్క్ చేశాడో మర్చిపోయి పోగొట్టుకున్న కారుని ఆరునెలల తరువాత ఇటీవలే పొందాడు. యూకేకి చెందిన ఓ వ్యక్తి, అతని కారు కథ ఇది. గత ఏడాది జూన్ నెలలో మాంచెస్టర్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లిన ఆయన.. తన స్నేహితుడి బీఎండబ్యూ కారులో స్కాంట్లాండ్ నుంచి మాంచెస్టర్ చేరుకుని ఓ ప్రాంతంలో ఆ కారును పార్క్ చేసి ఆ తరువాత పార్కింగ్ చేసిన స్థలాన్ని మర్చిపోవడంతో ఇంత సీన్ జరిగింది.
తాను ఎక్కడ పార్క్ చేశానో మర్చిపోయానంటూ, కారుపోయిందంటూ గత ఏడాది ఆగస్టులో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారం రోజుల క్రితం పోలీసులు ఆ కారుని కనిపెట్టారు. మాంచెస్టర్ సిటీ సెంట్రల్ కాంపెక్స్‌లోని పార్కింగ్ స్థలంలో దుమ్ము పట్టిపోయి ఓ కారు ఎంతో కాలంగా ఉందని సమాచారం పోలీసులు తెలుసుకొని ఆ కారు గురించి ఆరా తీశారు. అది ఆగస్టులో కారు పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తిదేనని కనిపెట్టి చివరకు ఆ కారును అప్పజెప్పారు. సామాన్యంగా చిన్న చిన్న వస్తువులని ఎక్కడో ఒక చోట పెట్టి మర్చిపోతుంటాం. అయితే, ఏకంగా బీఎండబ్యూ కారును పార్క్ చేసిన చోటునే మరిచిపోవడం ఆయనగారి మతిమరపుకు పెద్ద నిదర్శనం!