: మిగిలిన 10 శాతం కరెన్సీ వెనక్కొచ్చే సమస్యే లేదు: నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్
నోట్ల రద్దు తరువాత, రావాల్సినంత కరెన్సీ బ్యాంకులకు చేరిపోయిందని వ్యవస్థలో మిగిలిందని భావిస్తున్న మిగతా 10 శాతం కరెన్సీ డిపాజిట్ కాబోదని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రూ. 1.6 లక్షల కోట్లు లెక్క తేలకుండా ఉన్నట్టు అంచనా గణాంకాలు తెలియజేస్తున్నాయని చెప్పారు. రద్దయిన పెద్ద నోట్ల విలువ రూ. 16 లక్షల కోట్లుగా ఉంటుందని భావిస్తే, అందులో 10 శాతంగా రూ. 1.6 లక్షల కోట్లు తిరిగి వ్యవస్థలోకి రావని అన్నారు. 97 శాతం కరెన్సీ బ్యాంకుల్లోకి వచ్చిందని వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు.
కాగా, దేశంలో రూ. 14.4 లక్షల కోట్ల విలువైన రూ. 500, రూ. 1000 నోట్లుండగా, వాటిలో రూ. 14.97 లక్షల కోట్లు బ్యాంకులకు చేరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరెన్సీ విలువపై తమ ఆలోచన, గణాంకాలపై కేంద్రమే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ, కేంద్రం వెలువరించిన గణాంకాల కన్నా, అధికంగానే వ్యవస్థలో ఉండి వుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం వెల్లడించిన తాజా డిపాజిట్ గణాంకాల ప్రకారం, డిసెంబర్ 10 నాటికి రూ. 12.44 లక్షల కోట్లు బ్యాంకులకు వచ్చాయి. ఆపై మాత్రం మరోసారి అధికారిక గణాంకాలు విడుదల కాలేదన్న సంగతి తెలిసిందే.