Dharmendra Pradhan: కార్డులతో లావాదేవీలు జరిపితే అదనంగా ఛార్జీలు పడకుండా చూస్తాం: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి
పెట్రోలు వినియోగదారులు క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసుకోవడానికి అంగీకరించబోమని సంచలన ప్రకటన చేసిన పెట్రోల్ డీలర్ల సంఘాలు మళ్లీ తమ నిర్ణయంపై వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపే వారికి అదనంగా ఎటువంటి ఛార్జీలు పడకుండా చూస్తామని, తాము నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి కట్టుబడే ఉన్నామని చెప్పారు. కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు అనుగుణంగా 2016 ఫిబ్రవరిలో రూపొందించిన మార్గదర్శకాలనే అమలులో ఉంచుతామని చెప్పారు. అయితే, పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ చార్జీలను వసూలు చేయడం పట్ల ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ విషయంపై బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. మరోవైపు వినియోగదారులకు, డీలర్లకు ఊరట కలిగించేలా ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలే ఎండీఆర్ చార్జీలు భరించేలా ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.