: అది ధోనీ నిర్ణయమే.. మేం తప్పుకోమనలేదు: ఎమ్మెస్కే ప్రసాద్
వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నది ధోనీ తీసుకున్న సొంత నిర్ణయమని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ ధోనీపై తాము ఒత్తిడి తెచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ధోనీ చాలా నిజాయతీపరుడని... అతను తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరచలేదని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ గా కోహ్లీకి తగిన సమయం ఇచ్చేలా ధోనీ సరైన నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. ధోనీ పని ఇంతటితో అయిపోలేదని... కోహ్లీకి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ధోనీపై ఉందని చెప్పాడు. ధోనీ రాజీనామా వెనుక సెలక్టర్ల ఒత్తిడి ఉందంటూ ఓ జాతీయ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో, ఎమ్మెస్కే ప్రసాద్ పైవిధంగా స్పందించాడు.