: బీజేపీ 'చిన్నమ్మ'కు కోపం తెప్పించిన పుణె టెక్కీ!
సామాజిక మాద్యమాల్లో తన దృష్టికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని పేరున్న బీజేపీ 'చిన్నమ్మ' సుష్మా స్వరాజ్ కు కోపం వచ్చింది. పుణెకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి చేసిన ట్వీట్ కు ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అతనే తన శాఖలో పని చేస్తుంటే సస్పెండ్ చేసుండేదాన్నని ఘాటుగా సమాధానం ఇచ్చారు. "మేడన్ నా భార్య ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఉద్యోగినిగా పని చేస్తోంది. నేను పుణెలోని ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. ఆమెను పుణెకు బదిలీ చేసేందుకు సహకరించండి" అని అతను కోరగా, సోషల్ మీడియాలో ఇటువంటి ప్రశ్నలు అడుగుతారా? అని సుష్మ కోప్పడ్డారు. మీరిద్దరూ తన మంత్రిత్వ శాఖలో ఉద్యోగులై ఉంటే ఇంటికి పంపేదాన్నని అన్నారు. ఆపై ఆ ట్వీట్ ను రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు పంపగా, విషయం తన దృష్టికి తెచ్చినందుకు సుష్మా స్వరాజ్ కు ధన్యవాదాలంటూనే, బదిలీల్లో తన జోక్యం ఉండదని వెల్లడించారు. ఇట్లాంటి వ్యవహారాలను రైల్వే బోర్డే చూసుకుంటుందని బదులిచ్చారు.