: 840 సంవత్సరాల క్రితం నాగార్జున సాగర్‌లోనే చదువుకున్నా.. గత జన్మలో తాను కూర్చున్న ప్రదేశాన్ని అమ్మమ్మకు చూపించిన మూడేళ్ల భూటాన్ యువరాజు
తన గత జన్మ స్మృతులను అలవోకగా చెప్పేస్తున్న భూటాన్ మహారాజు జింగ్మే కేసర్ నంజల్ వాంగ్‌చుక్, రాణి జట్సన్ పీమా వాంగ్‌చుక్ మూడేళ్ల కుమారుడు హెచ్‌హెచ్ విరోచిచానా రింపోచే శనివారం నాగార్జున సాగర్‌ను సందర్శించాడు. 840 ఏళ్ల క్రితం భారత్‌లోనే పుట్టానని పేర్కొంటూ సంచలనం సృష్టించిన విరోచిచానా అప్పట్లో బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని పేర్కొన్న విషయం విదితమే.
తాజాగా శనివారం అమ్మమ్మ అశిడోర్జితో కలిసి నాగార్జునకొండను సందర్శించిన బుల్లి భూటాన్ యువరాజు.. గత జన్మలో ఆ కొండపై తాను తిరిగిన ప్రదేశాలను అమ్మమ్మకు చూపించాడు. తనకు కలలో కనిపించే ఐదు తలలపాము అప్పట్లో ఈ కొండపైనే తిరిగేదని పేర్కొన్నాడు. ఇప్పుడిక్కడ ఉన్న విగ్రహం బుద్ధుడిది కాదని, అది ఓ మాత విగ్రహమని వివరించాడు. అది అప్పట్లో నది మధ్యలో ఉండేదని పేర్కొన్నాడు.
తన మనవడు కారణజన్ముడని పేర్కొన్న యువరాజు అమ్మమ్మ.. నాగార్జున కొండకు రోజూ పడవలో వెళ్లి వచ్చినట్టు మనవడికి కలలు వస్తున్నాయని, అందుకే నాగార్జున సాగర్ సందర్శనకు వచ్చామని వివరించారు. నాగార్జున కొండను సందర్శించిన యువరాజు కుటుంబ సభ్యులు అక్కడి మ్యూజియం, సింహళ, బౌద్ధ స్థూపాలు, స్నానఘట్టాలు, అశ్వమేథ యాగశాల తదితర వాటిని సందర్శించారు. దలైలామా నాటిన బోధి మొక్కకు పూజలు చేశారు.