: ఢిల్లీలో అమ్మాయిలకు ముద్దులు పెట్టి పారిపోయే 'క్రేజీ సుమిత్'... అంతు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఢిల్లీ సైబర్ సెల్!


బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలను చూస్తే, వారి దగ్గరకు వెళ్లి బలవంతంగా ముద్దు పెట్టి పారిపోవడం అతనికి అలవాటు. అలా కిస్ చేసి పారిపోవడాన్ని వీడియోగా చిత్రీకరించి 'క్రేజీ సుమిత్' పేరిట యూ ట్యూబ్ లో ఉంచిన ఓ వీడియో వైరల్ కాగా, అతన్ని గుర్తించేందుకు ఢిల్లీ సైబర్ సెల్ సహా పలు యూనిట్లు కదిలాయి. అతనిపై మహిళలకు వేధింపులు సహా పలు క్రిమినల్ కేసులు పెట్టినట్టు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

కాగా, గత నెలలో ఈ వీడియోను పోస్టు చేయగా, లక్షలాది మంది దీన్ని వీక్షించారు. ఈ వీడియో విషయం పోలీసులకూ చేరింది. "ఈ తరహా లైంగిక ఉన్మాదంతో కొందరు పబ్లిసిటీ కోసం, లైకుల కోసం చూస్తున్నారు" అని ఢిల్లీ జేసీపీ (సౌత్ వెస్ట్రన్ రీజియన్) దీపేంద్ర పాఠక్ వ్యాఖ్యానించారు. సుమోటోగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఇదే యువకుడు తన వీడియోలను మరింత పాప్యులర్ చేసుకునేందుకు ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు నడుపుతున్నాడని వివరించారు.

కాగా, ఈ వీడియోలో యువకుడు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఓ యువతిని అడ్డగించాడు. ఆమెతో మాటలు కలుపుతూ, బుగ్గపై ముద్దుపెట్టి పరుగు లంఘించుకోవడం కనిపిస్తోంది. కొంత దూరం పాటు ఆమె వెంబడించినా, అతన్ని పట్టుకోలేకపోయింది. మరో దృశ్యంలో పార్కులోని జంట వద్దకు వెళ్లి, అబ్బాయిపై ఏదో స్ప్రే కొట్టి, ఆపై బలవంతంగా అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయాడు. వారు వెంబడిస్తుంటే, పార్కు ఫెన్సింగ్ దూకాడు.

కొంతదూరం నుంచి ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగానే ప్రణాళిక ప్రకారం, వీడియోను తీసేందుకు మరొకరిని నియమించినట్టు తెలుస్తోంది. కాగా, కిస్సింగ్ వీడియో వైరల్ అయ్యేవరకు ఈ ప్రబుద్ధుడు పోలీసుల చర్యలకు భయపడి, క్షమాపణలు చెబుతూ మరో వీడియోను పోస్టు చేశాడు కూడా. ఈవీడియోలు అప్ లోడ్ చేసిన ఐపీ అడ్రస్ కనుగొన్నామని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News