: మోదీ దెబ్బ‌కు పాకిస్థాన్‌లో మూత‌ప‌డుతున్న న‌కిలీనోట్ల ప్రింటింగ్ ప్రెస్‌లు.. క‌శ్మీర్‌లో 60 శాతం త‌గ్గిన హింస‌


పెద్ద నోట్లు ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తీసుకున్న నిర్ణ‌యంతో పాకిస్థాన్‌లోని న‌కిలీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్‌లు విల‌విల్లాడిపోతున్నాయ‌ని కేంద్ర నిఘా వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి తెలిపాయి. నోట్ల ర‌ద్దు త‌ర్వాత తీవ్ర‌వాద కార్య‌కలాపాల‌పై దృష్టిసారించిన నిఘా వ‌ర్గాలు తాజాగా ఓ నివేదిక‌ను కేంద్రానికి స‌మ‌ర్పించాయి. దాని ప్ర‌కారం.. నోట్ల ర‌ద్దు త‌ర్వాత పాక్ నుంచి ఉగ్ర‌వాదుల‌కు నిధులు అంద‌క‌పోవ‌డంతో ఉగ్ర కార్య‌క‌లాపాలు మందగించాయి. క‌శ్మీర్‌లో గ‌త నెల‌లో హింస 60 శాతానికి త‌గ్గింది. డిసెంబ‌రులో జమ్మూ‌క‌శ్మీర్‌లో ఒకే ఒక్క బాంబు ఘ‌ట‌న త‌ప్ప మ‌రే హింస చోటుచేసుకోలేదు. అలాగే హ‌వాలా కార్య‌క‌లాపాలు కూడా 50 శాతం వ‌ర‌కు త‌గ్గాయి.  

పాకిస్థాన్‌లోని క్వెట్టా, కరాచీల‌లో ఉన్న నోట్ల  ప్రింటింగ్ ప్రెస్‌ల‌లో భార‌త క‌రెన్సీకి నకిలీ ముద్రించేవారు. అయితే నోట్ల ర‌ద్దు త‌ర్వాత అక్క‌డ పెద్ద ఎత్తున ముద్రించి ఉంచిన పాత నోట్లు ఎందుకూ ప‌నికిరాకుండా పోయాయి. దీంతో ఉగ్ర‌వాదుల‌కు నిధులు అందకుండా పోయాయి. భార‌త్ విడుద‌ల చేసిన కొత్త నోట్ల‌లో సెక్యూరిటీ ఫీచ‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో వాటికి నకిలీలు త‌యారు చేయడం పాక్‌కు క‌ష్టంగా మారింది. దీంతో ప్ర‌స్తుతం న‌కిలీ నోట్లు త‌యారుచేస్తున్న అక్క‌డి ప్రింటింగ్ ప్రెస్‌లకు మూసుకునే మార్గం త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని భార‌త నిఘా వ‌ర్గాలు త‌మ నివేదిక‌లో పేర్కొన్నాయి.

 

  • Loading...

More Telugu News