: కిలో చికెన్ రూ.900, గుడ్డు రూ.45.. హాట్ కేకుల్లా 'కడక్‌నాథ్' అమ్మకాలు!
కడక్‌నాథ్.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ జాతి కోడి మాంసానికి ఇప్పుడు హైదరాబాద్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. కిలో రూ.900 పలుకుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. కోడి నుంచి మాంసం వరకు అంతా నల్లగా ఉండే ఈ జాతి కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. అలాగే దీని మాంసంలో ఔషధ గుణాలు ఉండడంతో వీటికి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. అంతరించే దశకు చేరుకున్న ఈ కోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. తమిళనాడు సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో వీటి పెంపంకం మొదలైంది.
బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి మాంసంలో పోషకాలు చాలా ఎక్కువని చెబుతున్నారు. కొవ్వు చాలా తక్కువగా ఉండి, మాంసకృత్తులు ఎక్కువగా ఉండడంతో ఈ చికెన్‌కు డిమాండ్ పెరిగింది. ఈ చికెన్ తినడం వల్ల జీర్ణశక్తి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఎనిమిదేళ్లు బతికే ఈ కోళ్లు ఏడు నెల్లలో కిలోన్నర మాత్రమే బరువు పెరుగుతాయి. కడక్‌నాథ్ చికెన్‌లో ఉండే ఔషధ గుణాలను పరిశీలించిన దేశ మాంస పరిశోధన సంస్థ దీని చికెన్‌ను క్రీడాకారుల డైట్లో చేర్చాలని సిఫార్సు కూడా చేసింది. ఇక కోడి గుడ్డు ధర రూ.45 పలుకుతుండగా, ఒక రోజు వయసున్న పిల్లను రూ. 150 ఇచ్చి కొనేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. ఇక వ్యాధుల భయం లేకపోవడంతో వీటి పెంపకానికి రైతులు కూడా ముందుకొస్తున్నారు.