: ఆ కంపెనీలో వేతనంగా కరెన్సీ బదులు జున్ను ఇస్తున్నారు!
యూరప్‌లోని అర్మేనియా దేశంలో ‘అస్తరక్ కాట్’ అనే జున్నును ఉత్పత్తి చేసే కంపెనీ తమ ఉద్యోగులకు వేతనంగా కరెన్సీ ఇవ్వకుండా జున్నునే ఇచ్చేస్తోంది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఆ కంపెనీ ఇక కరెన్సీని ఇచ్చుకోలేక ఇలా జున్నునే వేతనంగా ఇస్తుందట.
ఈ కంపెనీ నష్టాల పాలు కావడానికి ఓ కారణముంది. మార్కెట్లో ఉన్న తమ డిమాండ్‌ను తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఒక బోగస్ సర్వేను నమ్మేసిన ఆ కంపెనీ అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. తమ చీజ్‌కి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా డిమాండ్ ఉందని ఆ సర్వేలో తేలడంతో, ఆ కంపెనీ ఏడాది పొడవునా భారీ మొత్తంలో టన్నుల కొద్ది జున్నును ఉత్పత్తి చేసింది. ఆ తరువాత మార్కెట్‌లో ఆ ఉత్పత్తులకి గిరాకీ రాలేదు.
దీంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఆ కంపెనీ కష్టపడి ఉత్పత్తి చేసిన జున్ను ఇక కంపెనీలోనే ఉండిపోవడంతో వేతనాలకు బదులుగా జున్నునే వస్తుమార్పిడిలా మార్చుకోవాలని తమ ఉద్యోగులతో సహా స్థానిక వ్యాపారులను కోరింది. కిలో జున్ను 2వేల డ్రామ్ ( 280 రూపాయలు) విలువ ఉంటుందని, తాము ఆర్థికంగా పుంజుకున్నాక నగదు సర్దుబాటు చేస్తామని నచ్చజెప్పింది. ఈ ఐడియాకు కొందరు ఒప్పుకోగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. జున్ను ఎక్కువ కాలం నిల్వ ఉండదని వాపోయారు. అంతేగాక వస్తుమార్పిడి పద్ధతితో దాన్ని ఎలా ఉపయోగించుకుంటామని, ఆ జున్నును ఎవరూ ఎక్కువ ఉపయోగించరని అన్నారు. ఆ జున్నును అమ్మే క్రమంలో స్థానిక మేయర్ ప్రస్తుతం రష్యాతో పాటు ఇతర దేశాల్లోని వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు.