: చెన్నైలో విషాదం.. బాక్సింగ్ రింగ్‌లో కన్నుమూసిన 14 ఏళ్ల చిన్నారి
భవిష్యత్ ఆశా కిరణం బాక్సింగ్ రింగ్‌లో కుప్పకూలింది. నిండు నూరేళ్ల జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన 14 ఏళ్ల బాలిక తొలి రౌండ్‌లోనే కుప్పకూలి కన్నుమూసిన విషాద ఘటన తమిళనాడులోని ట్యుటుకోరిన్‌లో చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మరీశ్వరి 9వ తరగతి చదువుతోంది. బాక్సింగ్‌లో తన అంకుల్ వద్ద గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్న మరీశ్వరి స్కూల్లో 14-17 ఏళ్ల పిల్లల కోసం నిర్వహించిన బాక్సింగ్ పోటీలో పాల్గొంది.
అయితే తొలి రౌండ్‌లోనే బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూలు సిబ్బంది ట్యుటికోరిన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.