: ఉద్దానంలో మంచి నీటి ప్రాజెక్టు ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశం
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి ఈ బాధ్యతలను అప్పగించారు. కుప్పం తరహాలో ఉద్దానంలో కూడా మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు, ఈ నెల 26వ తేదీ నాటికి బాధిత గ్రామాలకు తాగునీటిని అందించాలని చంద్రబాబు డెడ్ లైన్ పెట్టారు. కిడ్నీ సమస్యలు ఉన్న అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఎన్టీఆర్ సుజల పథకం కింద రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీరు ఇస్తామని, కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లేందుకు ఉచిత పాసులు ఇచ్చి పంపుతామని, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు అండగా నిలుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా, ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా ప్రకటన వెలువడం ప్రాధాన్యత సంతరించుకుంది.