: 'చిన్నమ్మ' కోసం త్యాగానికి పోటీ పడుతున్న తమిళ ఎమ్మెల్యేలు, మంత్రులు
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళ కోసం ఇప్పుడు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. ఆమె కోసం 'మేం శాసనసభ స్థానాన్ని వదులుకుంటామంటే, మేమంటూ త్యాగానికి ముందుకొస్తున్నారు'. తద్వారా ఆమె దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానం నుంచి శశికళ పోటీ చేయాలంటూ ఇప్పటికే పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
శశికళకు గట్టి పట్టున్న పైడీ ప్రాంతంలో ఏ స్థానం నుంచి పోటీచేసినా ఆమె అవలీలగా విజయం సాధిస్తారని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాను రాజీనామా చేసి తన స్థానాన్ని ఆమెకు ఇస్తానని ఆండిపట్టు ఎమ్మెల్యే తంగ తమిళరసన్ పేర్కొన్నారు. 1984లో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2001లో జయలలిత కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఇప్పుడు శశికళ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక చిన్నమ్మ కోసం ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకునేందుకు శాసనసభ్యులు పోటీపడుతుండడాన్ని గమనించిన మంత్రులు సైతం ముందుకొస్తున్నారు. మంత్రి పదవితోపాటు, ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధమని పేర్కొంటున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎవరూ బహిరంగంగా ఆ ప్రకటన చేయలేదు.