: నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వానికి మిగిలింది రూ.50 వేల కోట్లే.. వెన‌క్కి వ‌చ్చిన రూ.15 ల‌క్ష‌ల కోట్లు!



ఏ ఉద్దేశంతో అయితే ప్ర‌భుత్వం పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసిందో ఆ ల‌క్ష్యం నెరవేరిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. నోట్ల ర‌ద్దుతో క‌నీసం రూ.3-4 ల‌క్ష‌ల కోట్లు మిగులుతాయ‌ని భావించిన కేంద్రానికి తాజా ప‌రిస్థితి మింగుడు ప‌డ‌డం లేదు. ఇందుకు కార‌ణం చ‌లామ‌ణిలో ఉన్న రూ.15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు దాదాపు తిరిగి బ్యాంకులకు చేరిన‌ట్టు స‌మాచారం. నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వానికి మిగిలింది కేవ‌లం రూ.40-50 వేల కోట్లు మాత్ర‌మేన‌ని తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్ స‌హా వివిధ సంస్థ‌లు ఇదే విష‌యాన్ని నొక్కి చెబుతున్నాయి. నోట్ల ర‌ద్దు త‌ర్వాత 50 రోజుల్లో బ్యాంకుల్లో జ‌మ అయిన మొత్తంపై అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, బ్యాంకుల్లోకి తిరిగి ఎన్ని కోట్లు వ‌చ్చాయ‌న్న విష‌యంపై ప్ర‌భుత్వం, ఆర్బీఐ ప్ర‌కటించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.

నోట్లు ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో రూ.15.4 ల‌క్ష‌ల కోట్ల విలువైన రూ. వెయ్యి, రూ.500 నోట్లు ర‌ద్ద‌య్యాయి. వీటిలో తిరిగి రూ.14.5 ల‌క్ష‌ల కోట్లు ఆర్బీఐకి చేరుకున్న‌ట్టు స‌మాచారం. నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వానికి క‌నీసం రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌యినా మిగులుతుంద‌ని అంచ‌నా వేశామ‌ని, అయితే ఇప్పుడు దానిని రూ.1.5 ల‌క్ష‌ల కోట్ల‌కు కుదించిన‌ట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ సంస్థ పేర్కొంది. ర‌ద్ద‌యిన మొత్తం నోట్ల‌లో 95 శాతం తిరిగి బ్యాంకుల‌కు చేరుకుంద‌ని తెలిపింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వానికి మిగిలింది రూ.50 వేల కోట్లు మాత్ర‌మేన‌ని వివ‌రించింది. కాగా బ్యాంకుల‌కు చేరిన పాత నోట్ల‌పై ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News