: చిన్నవారిని కాదు... పెద్దవారిని అరెస్ట్ చేయాల్సింది!: మమతా బెనర్జీని ఉద్దేశించి బుద్ధదేవ్ భట్టాచార్య
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య చాలా రోజుల తర్వాత బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ టీఎంసీపై ఆయన నిప్పులు చెరిగారు. అవినీతి, నల్లధనం గురించి మాట్లాడే హక్కు కూడా వారికి లేదంటూ మండిపడ్డారు. ఆ పార్టీలో పై నుంచి కింద వరకు కూడా అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. మమత ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులతో నిండిపోయిందని ఆరోపించారు.
నల్లధనం ఎక్కడో ఉందని ఆ పార్టీ నేతలు చెప్పడం మానుకోవాలని... వాళ్ల ఇంట్లో ఉన్న నల్లడబ్బును వెతుక్కుంటే మంచిదని సూచించారు. అవినీతికి పాల్పడ్డ ఇద్దరు టీఎంసీ ఎంపీలను అరెస్టు చేస్తే... మమతా బెనర్జీ నానా రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత అంత అరవాల్సిన అవసరం లేదని... అరెస్టైన వారంతా కుంభకోణాల్లో ఇరుక్కున్న వారేనని అన్నారు. అసలు సీబీఐ తప్పు చేసిందని... చిన్నవారిని వదిలేసి పెద్దవారిని అరెస్ట్ చేస్తే బాగుండేదని మమతను ఉద్దేశించి బుద్ధదేవ్ వ్యాఖ్యానించారు.