: సంచలన ఆరోపణలతో కోర్టుకెక్కిన అన్నా హజారే.. శరద్‌పవార్‌పై సిట్ దర్యాప్తు జరిపించాలంటూ పిల్
ప్రముఖ హక్కుల నేత అన్నా హజారే సంచలన ఆరోపణలతో బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. షుగర్ కోఆపరేటివ్ ఫ్యాక్టరీల కుంభకోణంలో ప్రభుత్వానికి రూ.25 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరారు. హజారే కోర్టులో దాఖలు చేసిన పిల్స్‌లో రెండు సివిల్‌వి కాగా, ఒకటి క్రిమినల్ పిల్. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈనెల 6న క్రిమినల్ పిల్ విచారణకు రానుంది.
కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను తొలుత అప్పుల్లోకి నెట్టి ఆ తర్వాత వాటిని నామమాత్రపు ధరకు అమ్మేశారని అన్నా హజారే పిల్లో పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, అందులోని సభ్యులు, ప్రజలకు రూ.25 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఎన్సీపీ చీఫ్, మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్, అతడి మేనల్లుడు, మాజీ మంత్రి అజిత్ పవార్‌కు కూడా ఈ కుంభకోణంలో పాత్ర ఉందని, వారిపైనా దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఆధారాలను పిటిషన్‌కు జతచేశారు.