: పెద్ద నోట్లు రద్దు చేసినంత మాత్రాన సంబరం కాదు.. నల్లధనం మూలాలను దెబ్బతీస్తేనే ఫలితం.. నోబెల్ బహుమతి గ్రహీత యూనస్
దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని పారదోలేందుకు పెద్ద నోట్లు రద్దు చేస్తే సరిపోదని, నల్లధనం మూలాలను దెబ్బతీసినప్పుడే ఫలితం ఉంటుందని బంగ్లాదేశ్‌కు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అభిప్రాయపడ్డారు. ఇస్కాలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్దనోట్ల రద్దుపై మాట్లాడారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
"నల్లధనంపై యుద్దానికి నోట్ల రద్దు మంచిదే కానీ అదొక్కటే సరిపోదు. నల్లధనం మూలాలపై దాడిచేసినప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నోట్ల రద్దు వల్ల మంచి, చెడు రెండూ ఉంటాయి. వ్యాపారాలు కొన్ని రోజులు మందగిస్తాయి. నల్లకుబేరుల భూముల విలువతోపాటు సాధారణ రైతుల భూముల విలువ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రజలను క్యాష్‌లెస్ లావాదేవీలవైపు మళ్లించేందుకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.
అయితే ఈ విషయంలో బలవంతం కూడదు. మారడం సులభం.. మారితే లాభం అన్న భావనను ప్రజల్లో తీసుకురాగలిగితే విజయం సాధించినట్టే. పేదలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకుల తీరు మారాలి. వారిని నమ్మి రుణాలిస్తే వారు తప్పకుండా చెల్లిస్తారు. అయితే తీసుకున్న రుణంతో ఏదైనా వ్యాపారం చేసేలా ప్రోత్సహించాలి. మా దేశంలో అదే చేసి విజయం సాధించాం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బంగ్లాదేశ్ వస్తువులు కనిపించడానికి ఇదే కారణం" అన్నారాయన.