: ప్రేమ వ్య‌వ‌హారంలో పోలీసుల అత్యుత్సాహం.. బేడీలు వేసి తీసుకెళ్లార‌న్నఅవ‌మానంతో హాస్ట‌ల్‌పై నుంచి దూకి విద్యార్థి మృతి



ప్రేమ వ్య‌వ‌హారంలో పోలీసులు చూపిన అత్యుత్సాహానికి ఓ విద్యార్థి నిండు ప్రాణం పోయింది. పోలీసులు బేడీలు వేసి త‌న‌ను తీసుకెళ్ల‌డాన్ని అవ‌మానంగా భావించిన విద్యార్థి తానుంటున్న హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ విషాదం చోటు చోసుకుంది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. నిజామాబాద్ జిల్లా గంగాధ‌రకు చెందిన ఒల్లాల సాయి గౌత‌మ్‌(21) నిజాంపేట‌లోని ఓ ప్రైవేటు హాస్ట‌ల్‌లో ఉంటూ జేఎన్‌టీయూలో బీటెక్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. సాయి గౌతమ్ నిజామాబాద్‌లో పాలిటెక్నిక్ చ‌దువుకుంటున్న స‌మ‌యంలో ప‌రిచ‌య‌మైన ఓ అమ్మాయి కూడా జేఎన్‌టీయూలోనే చ‌దువుకుంటోంది. దీంతో ఇద్ద‌రిమ‌ధ్య ప‌రిచ‌యం మ‌రింత పెరిగింది. ఇద్ద‌రూ త‌ర‌చూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.

వీరిద్ద‌రి విష‌యం తెలిసిన అమ్మాయి కుటుంబ స‌భ్యులు ఘ‌ట్‌కేస‌ర్‌లోని పోలీస్ ఔట్‌పోస్టులో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న త‌మ బంధువుకు చెప్పారు. అంద‌రూ క‌లిసి నిజాంపేట చేరుకుని సాయిగౌత‌మ్‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం హాస్ట‌ల్‌కు వ‌చ్చిన సాయిగౌత‌మ్‌ను పోలీసులు బేడీలు వేసి  స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. అనంత‌రం జామీనుపై విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న విద్యార్థి సోమ‌వారం తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నాడు.

పోలీసులు త‌న‌ను, త‌న త‌ల్లిని అవ‌మానించ‌డాన్ని జీర్ణించుకోలేని సాయి గౌత‌మ్ సోమ‌వారం సూసైడ్ నోట్ రాసి హాస్ట‌ల్ భ‌వ‌నం నుంచి కిందికి దూకాడు. తీవ్ర‌గాయాల‌పాలైన అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం మృతి చెందాడు. కాగా త‌ల్లిదండ్రుల‌కు సాయిగౌత‌మ్ ఏకైక కుమారుడు. బ‌తు‌కుతెరువుకు దుబాయ్ వెళ్లిన తండ్రి కుమారుడి మ‌ర‌ణ‌వార్త తెలిసి వెంట‌నే బ‌య‌లుదేరాడు. కుమారుడి మృతికి కార‌ణ‌మైన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌ల్లి రేణుక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News