: చంద్రబాబూ! పోలవరం ఆలస్యానికి కారణం నువ్వు కాదా?: కేవీపీ
'పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఉండేందుకు కోర్టులకు వెళ్లి ఆపింది నువ్వు, నీ పార్టీ నేతలు కాదా?' అని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. 'అలాంటి నువ్వు ఏ అర్హతతో పోలవరం నువ్వు కన్న కలలు అని చెప్పుకుంటున్నావు' అని ఆయన అడిగారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చెయ్యి, నిజానిజాలు ప్రజలకు తెలిసిపోతాయని ఆయన సవాలు విసిరారు. 'ప్రాజక్టుకు సంబంధించి కేవలం 32 కిలోమీటర్లు మాత్రమే వేసిన నువ్వే కలలు కనేసి, సంబరాలు చేసుకుంటే ఈ సంబరాలకు మూల కారణమైన కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి?' అని ఆయన అడిగారు.
'చరిత్రలో మొట్టమొదటి సారి నువ్వే నదులను అనుసంధానం చేశావా? ఇంకెవరూ చెయ్యలేదా? నీ గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పు?' అని ఆయన అడిగారు. వక్రీకరణతో నాలుగు సార్లు రెండు నదులను కలిపామని సంబరాలు చేసుకుంటావా? అని ఆయన ఎద్దేవా చేశారు. తప్పుడు పనులు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే నిన్ను నిలదీస్తే... ప్రతిపక్షాలను ఉన్మాదులుగా పోలుస్తావా? అని ఆయన మండిపడ్డారు. పోలవరం గురించి అంత పోరాడితే మరి ప్రత్యేకహోదా గురించి ఎందుకు పోరాడలేదని ఆయన ప్రశ్నించారు.