: చంద్రబాబూ! నువ్వు 'పోలవరం కలలు' కన్నావా?: నిలదీసిన కేవీపీ
పోలవరం ప్రాజెక్టుపై జరుగుతున్న వక్రీకరణను ఖండించేందుకే తాను మీడియా ముందుకు వచ్చానని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. హైదరాబాదులో పోలవరం ప్రాజెక్టుపై ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మానసిక ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని అన్నారు. చంద్రబాబునాయుడు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారేమోనని గతంలో హెచ్చరించానని, ఇన్నాళ్ల తరువాత అల్జీమర్స్ ముదిరిపోయినట్టు కనిపిస్తోందని అన్నారు. అలాంటి వ్యాధి ఆయనకు మాత్రమే నష్టం కలిగించదని, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం కలిగిస్తుందని ఆయన చెప్పారు. 'పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు కలలు కన్నారా? ఆ కలలు సాకారమైనందుకు పరవశం చెందుతున్నారా?' అని ఆయన ఎద్దేవా చేశారు.
'నేను చంద్రబాబును అడుగుతున్నా...అసలు పోలవరంలో చంద్రబాబుది కానీ, టీడీపీది కానీ ఏమాత్రమైనా పాత్ర ఉందా?' అని ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించి వందిమాగధులతో భజన చేయించుకుంటే వాస్తవాలు మరుగునపడిపోతాయా? అని నిలదీశారు. పోలవరం ప్రాజక్టు అసలు పేరు 'ఇందిరాసాగర్ పోలవరం' అని ఆయన చెప్పారు. అబద్ధాలు చెప్పడానికైనా, చరిత్రను వక్రీకరించేందుకైనా ఒక హద్దు ఉంటుందని ఆయన అన్నారు. నీకు రాజకీయ భిక్షపెట్టిన ఇందిరమ్మ పేరును ఎలా తొలగించావని ఆయన ప్రశ్నించారు. ఆమె రాజకీయ భిక్ష పెడితే ఆమె పేరు తొలగించి వేరొకరికి ధన్యవాదాలు చెబుతారా? అని ఆయన అడిగారు.
స్వాతంత్ర్యానికి ముందే పోలవరం కోసం జరిగిన ప్రయత్నాలతో 1980లో అంజయ్యగారు ప్రారంభించిన ప్రాజెక్టును నువ్వు కలలు కన్నానంటావా? అని ఆయన ప్రశ్నించారు. ఆ రోజైనా లేదా ఈ రోజైనా ఏ రోజైనా పోలవరం పేరెత్తేవా? అని ఆయన నిలదీశారు. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన నీకు, కాంగ్రెస్ కమిట్ మెంట్ గురించి కామెంట్ చేసే అర్హత ఉందా? అని ఆయన అడిగారు. అసలు పోలవరం ప్రాజెక్టో, డ్యామో నీకు తెలుసా? అని ఆయన ఎద్దేవా చేశారు. 'ఇంత చేసీ నువ్వు చేసిందేదైనా ఉందంటే అది 1800 కోట్ల రూపాయల నాబార్డు రుణం తెచ్చావు' అని ఆయన విమర్శించారు. నాబార్డు రుణం తెచ్చి గొప్ప ఉత్సవం చేసుకుంటావా? అని ఆయన అడిగారు.