: ‘ ఫేస్ టైమ్’ వల్లే నాటి యాక్సిడెంట్ జరిగిందంటున్న అమెరికా దంపతులు
సుమారు మూడేళ్ల క్రితం క్రిస్మస్ పండగ సందర్భంగా తమ ఇద్దరి కూతుళ్లతో కలిసి వెళ్తున్న అమెరికా దంపతులు జేమ్స్, బెథానీ మాడిసెట్ దంపతుల కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బెథానీ, పెద్ద కూతురు గాయాలతో బయటపడగా, చిన్నకూతురు మాత్రం చనిపోయింది. వచ్చే నెల 27న ఈ కేసు విచారణకు రానుంది. కాగా, టెక్సాస్ లోని ఓ హైవే పై వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బెథానీ దంపతులు ప్రయాణిస్తున్న కామ్రీ కారును హైవేపై పోలీసులు ఆపిన సమయంలో, వెనుక నుంచి చాలా స్పీడ్ గా వచ్చిన ఎస్ యూవీ ఒకటి ఈకారును ఢీకొట్టింది.
ఆ కారు నడుపుతున్న గారెట్ విహెల్మ్ ప్రమాదం జరిగిన సమయంలో ఐఫోన్ లోని ‘ఫేస్ టైమ్’లో వీడియో చాట్ చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలడం, అందుకు, నిందితుడు కూడా అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ‘యాపిల్’లోని ‘ఫేస్ టైమ్’ ను డ్రైవింగ్ చేసే సందర్భాల్లో సురక్షితంగా వాడాలని, ఈ మేరకు యూజర్లను కంపెనీ హెచ్చరించడంలో విఫలమైందని,బెథానీ దంపతులు ఆరోపిస్తు కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో కేసు వేశారు. ‘ఫేస్ టైమ్’ కు సురక్షితమైన, ప్రత్యామ్నాయ డిజైన్ ను రూపొందించడంలో విఫలమైన కారణంగా తమకు నష్టపరిహారం చెల్లించాలని బెథానీ దంపతులు డిమాండ్ చేస్తున్నారు. సదరు సంస్థ హెచ్చరికలు జారీ చేసి ఉంటే కనుక, హై వేపై యూజర్లు దానిని వాడరు కదా? అని అంటున్నారు.