: నోట్ల కష్టాలు తగ్గుముఖం పడుతున్న వేళ.. మరో బాంబు పేల్చిన బ్యాంకులు!
నోట్ల రద్దుతో పెరిగిన కష్టాలు ఇప్పుడిప్పుడే కాస్తంత తగ్గుముఖం పడుతున్న వేళ వినియోగదారుల నెత్తిపై బ్యాంకులు మరో బాంబు వేశాయి. ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై ఇప్పటి వరకు ఉన్న సడలింపును ఎత్తివేశాయి. నవంబరు 8వ తేదీకి ముందు ఉన్న నిబంధనలను తిరిగి అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. నిజానికి నోట్ల రద్దుతో మొదలైన కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏటీఎంలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానేలేదు. అయినా ఏటీఎం చార్జీల రూపంలో ఖాతాదారుల ముక్కు పిండేందుకు సిద్ధమవుతుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ల రద్దు తర్వాత డబ్బులు దొరకడం గగనంగా మారిన నేపథ్యంలో డిసెంబరు 31 వరకు డెబిట్ కార్డును ఏటీఎంలో ఎన్నిసార్లు ఉపయోగించినా ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమని ఆర్బీఐ ప్రకటించింది. ఈ ప్రకటన ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. అయితే గడువు ముగిసినా ప్రజల కష్టాల్లో మార్పులేదు. దీనికి తోడు ఆర్బీఐ నుంచి ఈ విషయంలో ఎటువంటి ప్రకటన లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నిన్న అకస్మాత్తుగా వినియోగదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వెల్లువెత్తడంతో కంగుతిన్నారు.
ఏటీఎంల నుంచి జరిపే తొలి ఐదు లావాదేవీలకు బ్యాంకులు ఎటువంటి చార్జీలు వసూలు చేయవు. ఆ పరిమితి దాటితే మాత్రం సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. నోట్ల రద్దుకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పరిమితి దాటిన తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.15 వసూలు చేస్తుండగా.. ఇతర బ్యాంకులు రూ.20 వసూలు చేస్తున్నాయి. కాగా డెబిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్‌పై తిరిగి సర్వీసు చార్జీలు వసూలు చేయనున్నట్టు వస్తున్న వార్తలపై ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం.