: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం... క్షమాపణలకు బీజేపీ పట్టు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో జాతీయగీతానికి అవమానం జరిగిందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్షాల ఆందోళనతో గవర్నర్ వెళ్లిపోయారు. దీంతో జాతీయ గీతాలాపన జరుగుతున్నప్పుడు విపక్షాలు ఆందోళన చేయడం, గవర్నర్ సభాస్థలిని వీడడం జాతీయ గీతానికి అవమానమని బీజేపీ ఆరోపించింది. తక్షణం విపక్షాలు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నేటి ఉదయం జమ్మూకశ్మీర్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ వోహ్రా అసెంబ్లీకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కశ్మీర్ లో నెలకొన్న అశాంతిపై విపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. వీటి తీవ్రత పెరుగుతుండడంతో గవర్నర్ వోహ్రా తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించి, ఆయన వెళ్లిపోయారు. ఈ సమయంలో జాతీయగీతాలపన జరుగుతుండడంతో బీజేపీ మండిపడుతోంది. ప్రతిపక్షాలు ఆందోళన చేయడం, గవర్నర్ వెళ్లిపోవడం జాతీయ గీతానికి తీరని అవమానమని, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, గవర్నర్ దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.