: ఎంతసేపూ పోలవరంపైనే విమర్శలా?: జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి ఫైర్
తిక్కముండా కొడుకు కాకపోతే జగన్ ఏం మాట్లాడతాడు? ఎంత సేపూ తిట్లేనా? పోలవరం మీద విమర్శలు చేస్తాడు? అంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫైరయ్యారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 'రాయలసీమకు ఏం కావాలో జగన్ అడగాలి కానీ విమర్శలు ఎందుకు? విమర్శల వల్ల ఏమొస్తుంది?' అన్నారు. తర్వాత మళ్లీ తనే చెబుతూ, 'జగన్ ను వాడు అనడానికి కారణం ఏంటంటే...వాడు మావాడు' అన్నారు. 'వాడిని చిన్నపిల్లాడప్పటి నుంచి చూస్తున్నా. అందుకే జగన్ ను వాడు అంటా'నని ఆయన చెప్పారు. అందరూ కులం అంటుంటారని, ఇప్పుడు పెళ్లిళ్లకే కులం అడ్డులేదని, అలాంటప్పుడు ఓట్లేసేటప్పుడు మాత్రం కులం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలు కూడా మారుతున్నారని, చంద్రబాబును మళ్లీ గెలిపిస్తే అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని ఆయన చెప్పారు.