: తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఎస్పీ సింగ్... పదవీ విరమణ చేసిన ఏకే ఖాన్ కు కీలక పదవినిచ్చిన కేసీఆర్
తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఎస్పీ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఏసీబీ డీఐజీ ఏకే ఖాన్ కు కీలక పదవిని అప్పగించింది. మైనారిటీ వ్యవహారాల శాఖకు సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ జీవోను విడుదల చేసింది. ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అరవింద్ కుమార్ ను నియమించింది.
కాగా, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 29 నెలల పాటు సీఎస్ గా పని చేసిన రాజీవ్ శర్మ నవంబర్ 30న పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో డిసెంబర్ 30తో పదవీ కాలాన్ని ముగించుకోనున్న ప్రదీప్ చంద్రను సీఎస్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఆపై తన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రదీప్ చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించడంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం ప్రవేశించిన తరువాత ఎస్పీ సింగ్ ను కొత్త చీఫ్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి.