: ప్రియుడి కోసం 2013లో పారిపోయిన యువతి... వ్యభిచార కూపంలో ప్రత్యక్షం
ప్రేమించిన యువకుడి కోసం 2013లో ఇల్లు వదిలి పారిపోయిన హైదరాబాద్ యువతి వ్యభిచార కూపంలో చిక్కుకుని నరకాన్ని అనుభవించగా, తాజాగా జరిగిన పోలీసుల దాడితో ఆమె బయటపడింది. ఈ ఘటనకు చెందిన మరిన్ని వివరాల్లోకి వెళితే, 2013లో చిక్కడపల్లికి చెందిన యువతి తన ప్రియుడి కోసం కడపకు వెళ్లింది. అతను కనిపించక, మోసపోయినట్లు గ్రహించిన ఆమె, తిరిగి ఇంటికి వెళ్లలేక, బస్టాండులో ఒంటరిగా కూర్చుని ఉండగా, కొందరు మహిళలు మాటలు కలిపి సహాయం చేస్తామని నమ్మించి తమ వెంట తీసుకెళ్లారు.
ఆపై రాయచోటి లోని ఓ వ్యభిచార ముఠాకు విక్రయించారు. ఇటీవల ఓ గృహంలో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం రావడంతో పట్టణ సీఐ మహేశ్వర్ రెడ్డి దాడులు నిర్వహించగా, బాధితురాలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమెను హైదరాబాద్ లోని బంధువులకు అప్పగించామని, వ్యభిచార గృహం నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు.