: నేటి నుంచి రూ. 4,500 తీయొచ్చు... కానీ ఎక్కడుంది?
కొత్త సంవత్సరం తొలి రోజున కూడా ప్రజలను నగదు కష్టాలు వీడలేదు. నేటి నుంచి ఏటీఎంల ద్వారా రూ. 4,500 విత్ డ్రా చేసుకోవచ్చని రెండు రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించగా, ఈ ఉదయం ఏటీఎంలు ఖాళీగా ప్రజలను వెక్కిరిస్తూ కనిపించాయి. జనవరి 1 నుంచి రోజుకు రూ. 4500 తీసుకునే అవకాశం కల్పించడం ప్రజలకు కాసింత ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ, హైదరాబాద్ లోని ఏ ఏటీఎంలోనూ ఈ ఉదయం నగదు కనిపించలేదు.
తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని అత్యధిక ఏటీఎంలలో ఇదే పరిస్థితి. కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని ఏటీఎంలలో నగదును నింపినప్పటికీ, వాటిల్లో డబ్బులు త్వరగా అయిపోవడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇక అన్ని ఏటీఎంలలో పూర్తి స్థాయిలో నగదు నింపేందుకు మరింత సమయం పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో కరెన్సీ చెస్ట్ ల నుంచి ఏటీఎంలకు నగదు వచ్చే అవకాశాలు లేవు. కనీసం రేపటి నుంచైనా అధిక ఏటీఎంలలో నగదు లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.