: సమాజ్ వాదీ సంక్షోభంలో ప్రముఖంగా వినిపించిన పేరు అపర్ణా యాదవ్... ఎవరు ఈమె?


సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన సంక్షోభం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కన్న కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ ను ఎస్పీ అధినేత ములాయం ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత ఈ రోజు జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఈ రాజీ విషయాన్ని పక్కన పెడితే... మొత్తం సంక్షోభంలో ఓ మహిళ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమే అపర్ణా యాదవ్. 26 ఏళ్ల అపర్ణా యాదవ్ కు ఏడాది క్రితమే లక్నో కంటోన్మెంట్ సీటును ములాయం సింగ్ రిజర్వ్ చేసి ఉంచారు. అసలు ఎవరు ఆమె? ఏంటి ఆమెకు ఉన్న ప్రాముఖ్యత? అనుకుంటున్నారా...

అపర్ణా యాదవ్... ఎవరో కాదు. ములాయం సింగ్ రెండో భార్య సాధనా గుప్త కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య. ప్రతీక్ యాదవ్ రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటూ, ఫిట్ నెస్ వ్యాపారంలో ఉన్నారు. దీంతో, అపర్ణా యాదవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆమెను కంటోన్మెంట్ స్థానం నుంచి బరిలోకి దించేందుకు ములాయం ముందుగానే ఫిక్స్ అయిపోయారు.

కేవలం రాజకీయాల్లోకి రావడమే కాదు... యువనేతగా ఎదగడమే లక్ష్యంగా అపర్ణ పావులు కదుపుతున్నారు. అవసరమైతే, అఖిలేష్ స్థానాన్ని కూడా ఆక్రమించాలనేది ఆమె ఆకాంక్ష. ఈ క్రమంలోనే ఆమె తనదైన శైలిలో పావులు కదిపారని చెబుతున్నారు. ములాయం సోదరుడు శివపాల్ వర్గంలో ఉన్న అపర్ణా యాదవ్ కు ములాయం ఆశీస్సులు దండిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, ములాయంకు, అఖిలేష్ కు మధ్య విభేదాలను అపర్ణతో పాటు, ఆమె భర్త ప్రతీక్ లు ఎగదోస్తున్నారని అఖిలేష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

అపర్ణ ఓ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి టైమ్స్ ఆఫ్ ఇండియా లక్నో బ్యూరో చీఫ్ గా పని చేస్తున్నారు. లక్నోలోని ఓ ప్రముఖ పాఠశాలలో అపర్ణ, ప్రతీక్ లు చదువుకున్నారు. అప్పట్లో ప్రతీక్ ఎవరో ఎవరికీ తెలియదు. 2007లోనే తమ మధ్య బంధాన్ని ములాయం సింగ్ బయటపెట్టారు. మరోవైపు, ప్రతీక్ ఎవరో తెలియకుండానే, ఆయనతో ప్రేమలో పడ్డారు అపర్ణ. ప్రతీక్ తల్లి వద్దకు తొలిసారి వెళ్లినప్పుడే... ఆయన ములాయం కుమారుడనే విషయం అపర్ణకు తెలిసింది. వీరిద్దరూ ఇంగ్లండ్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. మరోవైపు, వీరి వివాహానికి ఇటు ములాయం కానీ, అటు అపర్ణ తండ్రి కానీ తొలుత అంగీకరించలేదు. చివరకు ములాయంను సాధనా గుప్తా ఒప్పించాల్సి వచ్చింది. ఆ తర్వాత యూపీలోనే అత్యంత వైభవంగా వీరి పెళ్లిని ములాయం నిర్వహించారు.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... అపర్ణకు ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టం. 2015లో ములాయం మనవడి వివాహానికి మోదీ హాజరైనప్పుడు... తన భర్తతో కలసి మోదీతో సెల్పీ దిగారు అపర్ణ. బీజేపీ కార్యక్రమాలకు కూడా అప్పుడప్పుడు అపర్ణ మద్దతు ఇస్తుంటారు.  

  • Loading...

More Telugu News