: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా అనిల్ బైజాల్ ప్రమాణం... కేజ్రీవాల్ తో కలసి పనిచేస్తానంటూ వ్యాఖ్య
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా అనిల్ బైజాల్ ప్రమాణస్వీకారం చేశారు. 70 ఏళ్ల బైజాల్ చేత ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం బైజాల్ మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళల రక్షణ, వాయు కాలుష్యం, మౌలికవసతులు తదితర ఎన్నో సమస్యలు ఉన్నాయని... ఈ సమస్యలన్నింటిపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో అన్ని సమస్యలపై చర్చించి, పరిష్కారాలకై కృషి చేస్తానని తెలిపారు. కొన్ని రోజులు ఆగితే... అన్ని మార్పులను మీరే చూస్తారని చెప్పారు.