: జయను తల్చుకుంటూ భావోద్వేగానికి గురైన శశికళ
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ, దివంగత సీఎం జయలలితను తల్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. శశికళ మాట్లాడుతూ, ‘అమ్మ’ జయలలిత ఆశయాల బాటలోనే నడుస్తానని, ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని చెప్పారు. జయలలిత మరణిస్తారని కలలో కూడా ఊహించలేదని, ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తరుణంలో ఆమెకు మళ్లీ గుండెపోటు వచ్చిందని అన్నారు.
దేశ, విదేశాలకు చెందిన వైద్యులు జయలలితకు వైద్యం అందించారని, అయినా, ఆమె ఆరోగ్యం మెరుగుపడలేకపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. జయలలిత మరణంతో సర్వం కోల్పోయానని, 33 సంవత్సరాలు ఆమెతో కలిసి జీవించానని, ఆమె లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. జయలలిత రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కలిసి సాగానని శశికళ అన్నారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించిన ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం, పార్టీ నేతలు, తదితరులు హాజరయ్యారు.