: క్యాష్‌లెస్ లావాదేవీల 'భీం' యాప్ ఎలా పనిచేస్తుందంటే...!
డిజిటల్ భారతం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం తాజాగా శుక్రవారం భీం పేరుతో క్యాష్‌లెస్ లావాదేవీల కోసం సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న యాప్‌ల కంటే దీని వాడకం చాలా సులభతరం. స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫీచర్ ఫోన్ల వరకు అన్నింటిలోనూ దీనిని ఉపయోగించవచ్చు. అంతేకాదు.. దీనికి ఇంటర్నెట్‌తో పనిలేదు. ప్రస్తుతానికి అయితే ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లకు నెట్ ఉండాల్సిందే. అయితే ఇంటర్నెట్‌తో పనిలేకుండా యూఎస్ఎస్‌డీ(మెసేజ్) ద్వారా పనిచేసే యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
భీంను ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి
మొదట గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి భీం(బీహెచ్ఐఎం) యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఓపెన్ చేసి మనకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి. ఫోన్ నంబరు వెరిఫై చేసుకోవాలి. మనమిచ్చే ఫోన్ నంబరు బ్యాంకులో నమోదు చేసినదై ఉండాలి. నంబరు వెరిఫై అయిన తర్వాత సెల్‌కు మెసేజ్ వస్తుంది. దీనికి చార్జీ పడుతుంది. ఆ తర్వాత సీక్రెట్ పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మన బ్యాంకును ఎంచుకుని ముందుకెళ్లడమే.
చెల్లింపులు ఇలా చేయొచ్చు..
ఈ యాప్‌లో స్కాన్ అండ్ పే ఆప్షన్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ వస్తుంది. దానిని అవతలి వ్యక్తులకు పంపితే వారు స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చు. ఇదే పద్ధతితో మనం కూడా డబ్బులు చెల్లించవచ్చు. ఈ లావాదేవీలన్నీ మనం మొదట నమోదు చేసుకున్న బ్యాంకు నుంచే జరుగుతాయి. కాబట్టి ఇతర వాలెట్లలా ముందుగా అందులోకి డబ్బులు జమ చేసుకోవాల్సిన పనిలేదు. అలాగే భీంలో నమోదు కాని, యూపీఐ లేని ఖాతాదారులకు కూడా ఈ యాప్ సాయంతో డబ్బులు పంపించవచ్చు. ఐఎఫ్ఎస్‌సీ కోడ్, అకౌంట్ నంబరు, ఎంఎంఐటీ, మొబైల్ నంబర్లను ఉపయోగించి లావాదేవీలు జరిపే వీలుంది. ఈ యాప్ నుంచి డబ్బులు పంపించాలంటే తొలుత యూపీఐ పిన్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుంది.
ఇందుకోసం యాప్‌లో బ్యాంకు అకౌంట్ వద్దకు వెళ్తే రీసెట్ పిన్ ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేసి అది అడిగే వివరాలను ఎంటర్ చేయడం ద్వారా పిన్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పిన్ సాయంతో ఇతరులకు డబ్బులు పంపించవచ్చు. ఒకసారి గరిష్టంగా రూ.10 వేలు, రోజుకు రూ.20 వేలు ఈ యాప్ ద్వారా పంపించుకునే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌లో ఉన్న మరో విశేషం ఏంటంటే, దాదాపు అన్ని బ్యాంకులకు ఇది ఒక్కటే సరిపోతుంది. అందులో నమోదై ఉన్న బ్యాంకుల్లో ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకుకు అయినా లావాదేవీలు జరపవచ్చు.