russia: మరింత ముదురుతున్న వివాదం.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటున్న రష్యా!
ఇటీవల జరిగిన తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్రత్యర్థి దేశమయిన రష్యా సైబర్ ఆపరేషన్స్‌లో జోక్యం చేసుకోవడం, కోవర్ట్ ఆపరేషన్ వంటి చర్యలకు పాల్పడిందని తెలుపుతూ ఒబామా ప్రభుత్వం రష్యాపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రష్యా స్పై ఏజెన్సీలు, 35 మంది డిప్లొమాట్స్ పై చర్యలు తీసుకున్నట్లు అమెరికా కూడా ప్రకటించింది. దీంతో అమెరికాపై ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించిన రష్యా అన్నంత పనీ చేసింది. రెండు దేశాల మధ్య ముదురుతున్న వివాదం మరింత ఆందోళన కలిగించే విధంగా తయారయింది. అమెరికాలో పనిచేస్తోన్న 35 మంది రష్యా దౌత్య అధికారులపై అమెరికా వేటు వేసిన గంటల వ్యవధిలోనే, రష్యా కూడా తమ దేశంలో పనిచేస్తోన్న 35 మంది అమెరికన్ దౌత్య అధికారులపై వేటు వేసేందుకు పూనుకుంది.
ఇందుకు సంబంధిన అధికార ప్రకటనను విడుదల చేయడమే ఆలస్యంగా మారింది. రష్యా కేవలం అంతటితో ఆగడం లేదు. మాస్కోలోని ఆంగ్లో అమెరికన్ స్కూలును సైతం ఇప్పటికే మూయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎంతో శాంతంగా ఉన్నట్లు కనిపించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరికొన్ని రోజుల్లో పదవికి గుడ్ బై చెప్పనున్న సమయంలో రష్యాపై ఇటువంటి చర్యలు తీసుకుంటుండం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ దౌత్యాధికారులపై అమెరికా వేటు వేయడాన్ని నిరసిస్తూ బ్రిటన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఓ ఘాటైన ట్వీటు చేసింది. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం కోల్డ్ వార్‌ను తలపించేలా ఉందని, ఒబామా తన చివరి రోజుల్లో ఇలా ఏదో ఒకటి చేయడం వల్ల అమెరికన్లు సహా చాలామంది గర్విస్తారంటూ ఆయనను 'లేమ్ డక్' అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఒబామా తీసుకున్న నిర్ణయంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. త్వరలోనే ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమై ఈ వ్యవహారంపై చర్చిస్తానని చెప్పారు.