demonitisation: మీ చేతి వేళ్ల మీదే మీ భవిష్యత్తు వుంది!: డిజీ-ధన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ
ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన డిజీ-ధన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్న పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మీ చేతి వేళ్లమీదే ఇకపై మీ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కేవలం వేలి ముద్రలతో నగదురహిత లావాదేవీలు జరుపుకోవచ్చని చెప్పారు. భీమ్ పేరుతో సరికొత్త యాప్ ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో భీమ్ యాప్‌తోనే అన్ని లావాదేవీలు జరుగుతాయని చెప్పారు.
డిజిటల్ లావాదేవీలు నిర్వహించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోదీ చెప్పారు. భీమ్ యాప్‌తో డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయొచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో నగదురహిత లావాదేవీలకు మొబైల్, ఇంటర్నెట్ అవసరం లేదని చెప్పారు. పేదవాడి బతుకును మార్చడానికే డిజిటల్ ఇండియా నినాదం తీసుకొచ్చినట్లు చెప్పారు. నగదురహిత లావాదేవీలు జరిపిన వారికి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా మెగా డ్రా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం వంద రోజుల పాటు ప్రతిరోజూ 15 వేల మందికి లక్కీడ్రా ద్వారా రూ.1000 బహుమతి ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. రూ.50 నుంచి రూ.3 వేల వరకు నగదురహిత లావాదేవీలు చేసిన వారికి బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు.