: 'బీకామ్ లో ఫిజిక్స్'పై పేలుతున్న జోకులు... స్పందించిన జలీల్ ఖాన్
బీకాంలో ఫిజిక్స్ ఉంటుందంటూ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన తెలివితేటలపై జోకులు పేలాయి. 'రాజకీయ నాయకుల కోసం బీకాంలో ఫిజిక్స్ పెట్టుంటారులే' అంటూ సెటైరికల్ పోస్టులు వెల్లువెత్తాయి. ఏదైతేనేం, ఈ వీడియో పుణ్యమా అని కేవలం రెండు రోజుల్లోనే జలీల్ ఖాన్ ఫుల్ పాప్యులర్ అయిపోయారు. తాజాగా ఆ వీడియోపై జలీల్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన వివరణను ఓ వీడియో ద్వారా తెలియజేశారు.
గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ తాను గమనిస్తున్నానని... తనను ఇంతగా హైలైట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జలీల్ ఖాన్ అన్నారు. తాను మెట్రిక్యులేషన్ (10వ తరగతి) చదువుకున్నానని... సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యానని చెప్పారు. తర్వాత పీయూసీలో జాయిన్ అయ్యానని... కానీ, వ్యాపారంలో మంచి ఆఫర్ రావడంతో, చదువును డిస్ కంటిన్యూ చేశానని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో కూడా తన చదువు మెట్రిక్యులేషన్ అనే పేర్కొన్నానని చెప్పారు.
తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో వాస్తవాలే చెప్పానని... కానీ, ముందు తాను చెప్పింది డిలీట్ చేసి, తర్వాత చెప్పింది హైలైట్ చేశారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. పైచదువులు మీరెందుకు చదవలేదు? ఏం చదవాలనుకున్నారు? అనే ప్రశ్నకు బదులుగా... బీకాం చదవాలని అనుకున్నానంటూ చెప్పానని తెలిపారు. పీయూసీలో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉన్నట్టే... బీకాంలో కూడా ఫిజిక్స్ ఉంటుందని అనుకున్నానని చెప్పారు. వాస్తవానికి తాను ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పానని... కానీ, అనేకసార్లు అడిగితే కాదనలేక ఇచ్చానని... ఇంటర్వ్యూ తీసుకున్న వారు మా గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుందని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ తాము ఏదైనా తప్పు మాట్లాడినా దాన్ని సరిదిద్దుకోవాలని... ఇలా రాద్ధాంతం చేయకూడదని చెప్పారు.