: నేటితో సరి.. రద్దయిన నోట్ల జమకు నేడే ఆఖరు!
నోట్ల రద్దు తర్వాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. నేడు కూడా రద్దయిన నోట్లను బ్యాంకుల్లో జమచేసుకోలేకపోయిన వారు తగిన ఆధారాలు చూపించి రిజర్వు బ్యాంకులో వచ్చే ఏడాది మార్చి 31 వరకు మార్పిడి చేసుకోవచ్చు. ఇక కరెన్సీ కష్టాలు తీరడానికి ప్రధాని నరేంద్రమోదీ అడిగిన ఏభై రోజుల గడువు కూడా నేటితో ముగియనుంది. అయినా ఇప్పటికీ ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఏటీఎంలు ఇంకా దిష్టిబొమ్మల్లానే దర్శనమిస్తున్నాయి. 80 శాతం ఏటీఎంలు ముందు ఇంకా 'నో క్యాష్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిమాండ్ మేరకు కొత్త నోట్ల ముద్రణ లేకపోవడంతో మరో రెండు నెలలపాటు నోట్ల కష్టాలు కొనసాగవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నోట్ల రద్దు రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ రేపు(శనివారం) మరోమారు జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రజలకు ఆయనేం చెప్పబోతున్నారోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.