chandrababu: సమాజంలో రెండే కులాలు ఉన్నాయి.. అందులో నాది పేదల కులం: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఫైబర్‌గ్రిడ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.... మోరి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ఆ గ్రామంలో రూ.332 కోట్లతో తొమ్మిది నెలల్లో విద్యుత్ స్తంభాల ద్వారా ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ గ్రామాన్ని ఈ రోజే ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించినట్టు ఆయన పేర్కొన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వారిపట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సమాజంలో రెండే కులాలు ఉన్నాయని, మొదటిది డబ్బున్న కులం అయితే, మరొకటి డబ్బులేని కులం అని, తనది మాత్రం పేదల కులమేనని ముఖ్యమంత్రి చెప్పారు.
తాను ఎల్లప్పుడూ పేదలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలనే ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమం కింద కొత్త రేషన్‌కార్డులు ఇస్తుందని చెప్పారు. బుడగ జంగాలను ఎస్సీల్లో కలిపేందుకు ఇప్పటికే కమిటీని వేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్లరద్దు నిర్ణయంతో ఎంతో మంది ప్రజలు కష్టాలు పడుతుండడం పట్ల తాను ఆవేదన చెందినట్లు తెలిపారు. వారి కష్టాలను అర్థం చేసుకొనే జనవరి నుంచి పెన్షన్లన్నీ పాత విధానంలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాపు సామాజిక వర్గంపై తాము ప్రత్యేక శ్రద్దపెట్టినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని అన్నారు.