: ఈ ఏడాది ముగింపు ఓ సెకను ఆలస్యం!
ఓ సెకను ఆలస్యం కావడం ఏంటి...? అని ఆలోచిస్తున్నారా...? అవునండి. 2016 అర్ధరాత్రి 11.59 నిమిషాల 59 సెకన్ల తర్వాతి సెకనులో కొత్త సంవత్సరం ప్రారంభం కాదు. మరో సెకను ఆగాల్సిందే. ఎందుకంటే ఈ ఏడాదికి సంబంధించి గడియారంలో ‘కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్’ కు ఓ సెకను అదనంగా కలుపుతున్నారు. దీన్నే లీపు సెకను అంటారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నేవల్ అబ్జర్వేటరీ తెలిపింది.
భూమి, ఇతర గ్రహాల గమనం ఆధారంగా కాల గమనం ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే. భూమి సగటున ఆటోమిక్ టైమ్ తో పోలిస్తే ప్రతీ రోజూ 1.5 నుంచి 2 మిల్లీ సెకన్లు నిదానంగా తిరుగుతుంది. ఇలా ప్రతి 500 నుంచి 750 రోజులకు భూమి చలన సమయం, ఆటోమిక్ టైమ్ తో పోలిస్తే ఒక సెకను పాటు ఆలస్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే దాన్ని సరిచేసేందుకు ఇలా కలుపుతుంటారు.