kodandaram: అరెస్టు చేసిన వారిని విడుదల చేసేవరకు కోదండరాం దీక్ష విరమించనన్నారు: టీపీసీసీ నేతలు
హైదరాబాద్ తార్నాకలోని తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టిన టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాంకు టీపీసీసీ నేతలు మద్దతు తెలిపారు. కోదండరాం ఇంటి వద్దకు చేరుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలేదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న వారిని అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేసేవరకు కోదండరాం దీక్ష విరమించనని చెప్పారని అన్నారు.
తాము కోదండరాంకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత కూడా రాష్ట్రంలో రైతుల బాధలు తగ్గకపోవడం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతుందనుకుంటే, టీఆర్ఎస్ అసమర్థ పాలన, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిరాశే మిగులుతోందని అన్నారు. ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు.