: నిరుద్యోగులకు పండుగ.. 611 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. నేడో రేపో గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా!
సంకాంత్రి పండుగకు ముందే ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు పండుగలాంటి వార్త చెప్పింది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సహా వివిధ శాఖలకు చెందిన 611 పోస్టుల భర్తీ కోసం బుధవారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో రెండు రోజుల్లో గ్రూప్-3 నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇక బుధవారం జారీ చేరిన నోటిఫికేషన్‌కు నేటి (గురువారం) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు. జనవరి 28, 2017తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. ఇదే నోటిఫికేషన్‌తో గ్రూప్-3 నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయాలని భావించినా సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదు.
గ్రూప్-3 కింద మొత్తం 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థుల వడపోతలో కొత్త విధానాన్ని అవలంబించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. యూపీఎస్సీ తరహాలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు రిజర్వేషన్లు పాటిస్తూ 1:12 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతోనే గ్రూప్-3 నోటిఫికేషన్‌ను ఆపేసి మిగతా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.