: ములాయం జాబితాలో అఖిలేష్ యాదవ్ పేరు ఏమైంది?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు తండ్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కళ్లెం వేసినట్టు కనిపిస్తోంది. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ములాయం సింగ్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 325 మంది అభ్యర్థులతో సమాజ్ వాదీ పార్టీ జాబితా విడుదల చేయగా, అందులో 176 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించినట్టు ఆయన ప్రకటించారు. ఇంకా 78 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే ఈ జాబితాలో సీఎం అఖిలేష్ యాదవ్ కు ములాయం స్థానం కల్పించకపోవడం విశేషం.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సీఎం అఖిలేష్ యాదవ్, ఎస్పీ యూపీ అధ్యక్షుడు, బాబాయ్ శివపాల్ యాదవ్ మరో జాబితాను రూపొందించారు. దీంతో ఇద్దరి మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ములాయం అభ్యర్థుల జాబితా విడుదల చేయగా ,అందులో శివపాల్ యాదవ్ వర్గానికి పెద్దపీట వేశారు. దీనిపై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ, అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన రాష్ట్రంలోని ఏ స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పలేదని. దీంతోనే ఆయన పేరు ప్రకటించలేదని తెలిపారు.