: 3న తిరుమలకు రానున్న ప్రధాన మంత్రి
భారత ప్రధాన నరేంద్ర మోదీ జనవరి 3న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం... 3వ తేదీ ఉదయం ప్రధానమంత్రి తిరుపతి చేరుకుంటారు. అనంతరం అక్కడ జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇస్కా) మహాసభలను ప్రారంభిస్తారు. అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్లిపోతారు.
కానీ, తిరుపతి వరకు వచ్చినందుకు, తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకోవాలంటూ ప్రధానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో, ప్రధాని అధికారిక పర్యటనలో కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. 2న తిరుపతికి వచ్చి నేరుగా తిరుమల వెళ్లి, అక్కడ బస చేసి 3వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకోవడం... లేదా 3న తిరుపతికి వచ్చి, ఇస్కా సభలను ప్రారంభించి, మధ్యాహ్నం తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకుని, తిరిగి ఢిల్లీ వెళ్లిపోవడం. పై రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఖరారయ్యే అవకాశం ఉంది.