: మినీ మహా సంగ్రామానికి వేళాయే... 30న ఎన్నికల షెడ్యూల్ విడుదల!


దేశ భవిష్యత్ రాజకీయాలకు, ప్రధాని మోదీకి ప్రజల్లో వున్న ఆదరణకు రెఫరెండంగా భావిస్తున్న 2017 మినీ మహా సంగ్రామానికి సమయం వచ్చేస్తోంది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ నెల 30వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించవచ్చని సమాచారం. యూపీ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి వున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 30న ప్రత్యేకంగా సమావేశం కానున్న ఎలక్షన్ కమిషన్ అధికారులు, అదే రోజున ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని, ఆ రోజు నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని అధికార వర్గాల సమాచారం.

యూపీ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించాలని, మిగతా రాష్ట్రాల ఎన్నికలు ఒక దశలో నిర్వహిస్తే సరిపోతుందని ఇప్పటికే ఈసీకి సూచనలు అందినట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లోని టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకముందే ఎన్నికల తేదీలు ఉంటాయని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో తొలి దశ ఎన్నికలు మొదలవుతాయని సమాచారం. కాగా, 2012లోనూ యూపీ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. అప్పట్లో డిసెంబర్ 24, 2011న షెడ్యూల్ విడుదల కాగా, ఫిబ్రవరి 8 - మార్చి 3, 2012 మధ్య ఎన్నికలు జరిగాయి. ఇక ఈసీ సమావేశంలో ఐదు రాష్ట్రాల్లో భద్రతా ఏర్పాట్లు, మోహరించాల్సిన కేంద్ర బలగాలు తదితరాలపైనా చర్చ జరుగుతుందని సమాచారం. కనీసం 21 రోజుల పాటు ప్రచారానికి, ఆపై నామినేషన్లకు రెండు వారాల గడువు వుండేలా తేదీలు ఉంటాయని అధికార వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News