demonitisation: నగదు రహిత లావాదేవీలపై ఢిల్లీలో చంద్రబాబు అధ్యక్షతన భేటీ ప్రారంభం
పెద్దనోట్ల రద్దు తదనంతర పరిస్థితులతో పాటు దేశంలో నగదు రహిత లావాదేవీలపై అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమన్వయ కర్తగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఈ కమిటీలోని పలువురు సభ్యులు సమావేశమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల వరకు సమావేశం కొనసాగనుంది. పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో ఏర్పడిన పరిస్థితులపై వారు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డిజిటల్ లావాదేవీల కోసం అత్యుత్తమ పద్ధతులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి చంద్రబాబుతో పాటు సిక్కిం సీఎం పవన్ కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగడియా హాజరయ్యారు. నీతి ఆయోగ్ కార్యాలయం నుంచి కమిటీలోని మిగతా సభ్యులైన సీఎంలతో కూడా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది.