: చైనా బస్సులు వచ్చేస్తున్నాయ్... కొనుగోలు ఆలోచనలో చంద్రబాబు సర్కారు!
చైనా నుంచి బస్సులను కొనుగోలు చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ బస్సులను చైనా సంస్థ 'బీవైడీ' తయారు చేస్తుండగా, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య, కార్పొరేషన్ ఈడీలు ఆ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై బస్సుల కొనుగోలు విషయమై చర్చించారు. బీవైడీ నుంచి కన్నడ ప్రభుత్వం 150 బస్సులను కొనుగోలు చేసేందుకు డీల్ ఇప్పటికే కుదరగా, ఏపీఎస్ ఆర్టీసీకి కూడా బస్సులను అందిస్తామని బీవైడీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
అయితే, కనీసం 100 బస్సులను తీసుకోవాలని చైనా సంస్థ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఒక్కో బస్సు ఖరీదు రూ. 2.70 కోట్లు కావడంతో వంద బస్సులకు రూ. 270 కోట్లు చెల్లించాల్సి వుంటుంది. ఇక అద్దె పద్ధతిలో అయితే కిలోమీటరుకు రూ. 68 చొప్పున బీవైడీ అడుగగా, ఆ మొత్తం ఎక్కువని ఆర్టీసీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక ఈ బస్సుల కొనుగోలు విషయమై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని మాలకొండయ్య వివరించారు.