: నోట్ల రద్దుకు నేటితో హాఫ్ సెంచరీ.. బౌండరీలు దాటుతున్న కష్టాలు!
మొత్తానికి నోట్ల రద్దు నిర్ణయం వెలువడి నేటికి 50 రోజులు. మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో ప్రజలు ఇన్ని రోజులపాటు మౌనంగా తమ కష్టాలను భరించారు. రోజురోజుకు తమ ఇక్కట్లు తగ్గుతూ వస్తాయని మురిసిపోయారు. అదే సమయంలో నల్లకుబేరులకు కష్టకాలం మొదలైందని తెగ సంతోషపడిపోయారు. దీనికి తోడు యాభై రోజుల తర్వాత ప్రజల కష్టాలు తగ్గి అవినీతి పరులకు కష్టాలు పెరుగుతాయని ప్రధాని మోదీ కూడా చెప్పారు. మరి ప్రధాని చెప్పినట్టు సామాన్యుల కష్టాలు తీరిపోయాయా? నల్లబాబులకు కష్టాలు మొదలయ్యాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కొంచెం కష్టమైన పనే. కొంచెం వివరంగా చెప్పుకుంటే..
దేశంలో విపరీతంగా సంపదను పోగేసుకున్న నల్లబాబులను ఏమీ చేయలేని సామాన్యులు పెద్ద నోట్ల రద్దుతో 'మంచి పని' జరిగిందని సంబరపడ్డారు. అయితే వారికేదో జరిగిపోతుందని భావించిన ప్రజలకు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మరోవైపు 50 రోజుల తర్వాతైనా చేతికి చాలినన్ని డబ్బు వస్తాయని భావించిన వారికి సర్కారు నగదు రహితం అంటూ చావుకబురు చల్లగా చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నారు.
మౌలిక వసతులు కూడా సరిగా లేని దేశంలో 'క్యాష్‌లెస్' ఏంటంటూ ఎగతాళి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా ముందుకే వెళ్తోంది. అదే సమయంలో దేశంలో బినామీల పేరుతో పేరుకుపోయిన ఆస్తులను లాక్కునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో సంచలనాత్మక చర్యలకు దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. వివిధ రూపాల్లో సంపదను పోగేసుకున్న ఏ ఒక్కరినీ వదలకూడదనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అదే కనుక జరిగితే కష్టాలను పంటికింద బాధను అణచిపెట్టుకుని నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ప్రజలకు మోదీ 'రాబిన్‌హుడ్' అవుతారు. లేదంటే నల్లకుబేరులను ఏమీ చేయలేక, ఏదో చేయాలని ఆశించి చివరికి ప్రజలను కష్టాలపాలు చేసిన ప్రధానిగా మిగిలిపోతారని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.
ఇక నోట్లు రద్దు నిర్ణయం వెలువడి నేటికి 50 రోజులు అయినా దేశంలో ఇంకా 80 శాతం ఏటీఎంలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఆర్బీఐ నుంచి డబ్బులు ఇదిగో వచ్చేస్తున్నాయి, అదిగో వచ్చేస్తున్నాయి అని చెబుతున్న ప్రభుత్వం మాటలు ఉత్తివేనని తేలిపోతున్నాయి. బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక, ఏటీఎంలలో రాక ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఏదైనా ఊహించని అద్భుతం జరిగితే తప్ప ప్రజల కష్టాలకు పుల్‌స్టాప్ పడదు. అనుకున్నట్టు ప్రధాని వద్ద 50 రోజుల కష్టాలకు పుల్‌స్టాప్ పెట్టే మంత్రదండం ఉంటే తప్ప సామాన్యులకు మరో రెండునెలలు అష్టకష్టాలు తప్పవన్నమాటే.