: సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం భేటీ.. తమిళ రాజకీయాల్లో చర్చకు దారితీసిన వైనం
తమిళ రాజకీయాల్లో మంగళవారం మరో చర్చనీయాంశమైన భేటీ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తమిళ సూపర్ సార్ట్ రజనీకాంత్‌ను ఆయన ఇంటిలో కలుసుకున్నారు. ఇంటికి వచ్చిన మాజీమంత్రిని రజనీకాంత్ సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై వీరిరువురూ చర్చించినట్టు తెలుస్తోంది. కాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి రజనీ గతంలో ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు నోట్ల రద్దును చిదంబరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. వారిద్దరూ కలిసి ఏం మాట్లాడుకుని ఉంటారన్న దానిపై తమిళనాట జోరుగా చర్చలు సాగుతున్నాయి.