: రిలయన్స్ జియో సమాధానం చెప్పాల్సిందే!: ట్రాయ్
ఉచిత మంత్రంతో మార్కెట్లోకి వచ్చి తక్కువ సమయంలోనే అత్యధిక మంది వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ జియోను పలు అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కోరింది. రిలయన్స్ జియో తాజాగా ఈ నెల 1న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్‌ను తీసుకొచ్చి తాము అందిస్తోన్న 90 రోజుల ఉచిత డేటా, వాయిస్ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు జియో చేసిన మరో సంచలన ప్రకటన మిగతా టెలికాం కంపెనీలకు ఆగ్రహం తెప్పించింది.
ఈ నేపథ్యంలో, ఈ ఆఫర్ నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో తెలపాలని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తాము జియోకు ఈ మేరకు ఇటీవలే ఓ లేఖను పంపించామని, జియో నుంచి త్వరలోనే సమాధానం వస్తుందని తాము అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జియో డేటా ఆఫర్ లో స్వల్ప మార్పు తప్ప పాత ఆఫర్ కు పొడిగింపుగానే కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జియోకు ప్రకటించిన తాజా ఆఫర్ కు వ్యతిరేకంగా మరో టెలికాం సంస్థ ఎయిర్ టెల్ టెలికం వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ను ఆశ్రయించి, జియో ప్రకటించిన తాజా ఆఫర్‌కు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. జియో మొదట్లో ప్రకటించిన ‘వెల్ కమ్ ఆఫర్’ ముగిసిన అనంతరం కూడా మరో ఫ్రీ ఆఫర్ కొనసాగింపునకు అనుమతినివ్వడం ఏంటని అడిగింది.