: అది నా సొంత ఇల్లు కాదు... ప్రజల ఆస్తి!: కేసీఆర్
తెలంగాణ శాసనసభలో ఈ రోజు బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అనవసరమైన విమర్శలతో తమ ప్రభుత్వంపై విపక్ష సభ్యులు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నివాసం గురించి సభ్యులు అల్పంగా మాట్లాడటం సరికాదని అన్నారు.
అది తన సొంత ఇల్లు కాదని... ప్రజల ఆస్తి అని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే, వారు ఆ నివాసంలో ఉంటారని తెలిపారు. అయినా, అందులో ఏమైనా 150 గదులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన క్యాంపు కార్యాలయంలో సీఎం కాన్వాయ్ కు తప్ప మిగతా వాహనాలకు పార్కింగ్ స్థలమే కరువయ్యేదని... పార్కింగ్ చాలా ముఖ్యమని చెప్పారు. మంత్రులు, వందలాది అధికారులతో రివ్యూలకు, కొత్త పథకాల రూపకల్పనకు, ప్రజలతో సమావేశాలు నిర్వహించేందుకు ఈ భవనాన్ని నిర్మించామని తెలిపారు. ముఖ్యమంత్రి నివాసం గురించి దిగజారుడుగా మాట్లాడటం సరికాదని చెప్పారు.