: ఎవరి చెప్పుచేతల్లో ఉండి వర్మ ఈ సినిమా తీశారు?.. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి: మల్లాది విష్ణు ఫిర్యాదు
విజయవాడలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా ఎన్నో వివాదాల చుట్టూ తిరుగుతోంది. రాంగోపాల్ వర్మ తీసిన ఈ సినిమా సన్నివేశాలపై అభ్యంతరాలు తెలుపుతూ ఆయనను అరెస్టు చేయాల్సిందేనంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు విజయవాడలో సబ్‌కలెక్టర్ సలోనికి వినతిపత్రం అందించారు. వర్మతో తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మల్లాది విష్ణు తెలిపారు. వర్మ ఎవరి చెప్పుచేతల్లో ఉండి ఈ సినిమాను తీశారో చెప్పాలని ఆయన అన్నారు. వంగవీటి మోహన రంగాపై వ్యక్తిగత విమర్శలు చేయడం భావ్యంకాదని, సినిమాలోనూ ఆయన జీవితాన్ని వర్మ వక్రీకరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.